Telangana: ఆస్తి కోసం.. తల్లిదండ్రులకు సీఐ చిత్రహింసలు
పోలీస్ శాఖలో పనిచేస్తూ, చట్టం తన చేతిలో ఉందంటూ.. కన్న తల్లిదండ్రులకే నరకం చూపిస్తున్నాడు ఓ సీఐ
By అంజి Published on 6 Aug 2024 8:06 AM GMTTelangana: ఆస్తి కోసం.. తల్లిదండ్రులకు సీఐ చిత్రహింసలు
న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడమే కాకుండా.. న్యాయం జరిగే వరకు తోడుగా నిలిచి శభాష్ పోలీస్ అంటూ ఎన్నో ప్రశంసలు అందుకుంటోంది పోలీస్‌శాఖ. అయితే ఆ శాఖలో కొంతమంది చీడపురుగులు ఉన్నారు. వారి వల్ల మొత్తం పోలీస్ శాఖకే చెడ్డ పేరు వస్తోంది. పోలీస్ శాఖలో పనిచేస్తూ, చట్టం తన చేతిలో ఉందంటూ.. కన్న తల్లిదండ్రులకే నరకం చూపిస్తున్నాడు ఓ సీఐ. రోజు రోజుకి ఆ కొడుకు పెట్టే వేధింపులు భరించలేక ఆ తల్లిదండ్రులు, కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాధ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. రఘునాధ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలలో పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నాడు.
15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ, హింసించాడు. పెద్ద కొడుకు వేధిం పులు తాళలేక తమ చిన్న కొడుకు ఆత్మ హత్యయత్నానికి పాల్పడ్డారని తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి, అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఆవేదన తెలుసుకున్న డిజిపి వెంటనే స్పందించి కొడుకు సీఐపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.