ఖమ్మం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చీమలపాడు ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో కుట్ర ఏమైనా ఉందా అనేది విచారణలో తేలుతుందని, మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏప్రిల్ 12న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి చెందగా, ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే.
బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సభా ప్రాంగణానికి కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే చీమలపాడులో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.