Nizamabad: 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  9 July 2023 12:31 PM IST
child marriage, nizamabad, Telangana

Nizamabad: 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల వ్యక్తి

బాల్య వివాహాలును అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన.. ఎక్కడో ఓ చోట దొంగచాటుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించి తెలంగాణలో ఓ ఘటన వెలుగు చూసింది. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

తండాకు చెందిన 13 ఏళ్ల బాలికను ఫకీరాబాద్‌కు చెందిన 42 ఏళ్ల సాహెబ్‌రావు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అంగన్‌వాడీ టీచర్‌తో పాటు పలువురు ఈ విషయాన్ని తెలుసుకొని జిల్లా బాలల పరిరక్షణ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే పోలీసులు, అధికారులు గ్రామానికి చేరుకునే లోపే సాహెబ్‌రావు.. 13 ఏళ్ల బాలికను తన వెంట పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే పెళ్లిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులు, అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.

శనివారం నాడు డీసీపీవో చైతన్య కుమార్‌ ఆధ్వర్యంలో తండాకు వెళ్లి విచారణ చేపట్టారు. బాల్య వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు, పెళ్లికి సహకరించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్యదర్శి హైమద్‌ నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాల్య వివాహం చేసుకున్న సాహెబ్ రావ్‌కు ఇప్పటికే పెళ్లి జరిగి భార్య మరణించింది. అతనికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. బాధిత బాలిక చదవు మధ్యలోనే మానేసిందని సమాచారం.

Next Story