ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1 రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చింది. ఈ నెల 9న శిక్ష ఖరారు చేయనుంది. మిగిలిన 11 మందిని నిర్దోషులుగా తీర్పునిస్తూ వారిపై కేసు కొట్టేసింది. జూబ్లీహీల్స్ పోలీసులు ఇటీవల 23 పేజీల చార్జిషీట్ ను దాఖలు చేశారు. మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు.
చిగురుపాటి జయరాం 2019 జనవరి 31 హత్యకు గురయ్యారు. నిందితుడు రాకేశ్ ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు జయరాం డెడ్ బాడీని విజయవాడ నందిగామ హైవేపై కారులో వదిలేసి వెళ్లిపోయారు. ఆర్థిక లావాదేవీల విషయంలో చిగురుపాటి జయరాంను హత్య చేసినట్లు ఆరోపణలు రాగా.. సంచలన హత్యకు సంబంధించి జయరాం మేనకోడలు శిఖాచౌదరి కూడా ఈ కేసులో ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఈ కేసులో రాకేశ్ రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముగ్గురు పోలీస్ అధికారులను కూడా నిందితులుగా చేర్చారు. నాలుగేళ్ల పాటు జరిగిన ఈ కేసు విచారణలో నాంపల్లి కోర్టు ఇవాళ తుది తీర్పునిచ్చింది.