పాలమూరును అత్యంత అభివృద్ధి చేస్తా.. నాది బాధ్యత: సీఎం రేవంత్‌

ఒకప్పుడు తట్టపని, మట్టి పని, పార పని కోసం వలసలు వెళ్లిన పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

By -  అంజి
Published on : 18 Jan 2026 6:42 AM IST

Chief Minister Revanth Reddy, Palamuru, most developed district , Telangana

పాలమూరును అత్యంత అభివృద్ధి చేస్తా.. నాది బాధ్యత: సీఎం రేవంత్‌

ఒకప్పుడు తట్టపని, మట్టి పని, పార పని కోసం వలసలు వెళ్లిన పాలమూరును తెలంగాణలోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి తెలంగాణ పర్యటనకు వచ్చే వారు తప్పనిసరిగా పాలమూరు జిల్లాను సందర్శించేలా అభివృద్ధి చేయాలన్నది తన కల అని చెప్పారు. ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఒకప్పుడు రాష్ట్ర పర్యటనకు వచ్చిన వారు గ్రాంట్ల కోసం పాలమూరులోని పేదరికాన్ని చూపించిన సందర్భాలు అత్యంత బాధాకరమని, పదేండ్లు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించి ముందుకు సాగుతున్నామని అన్నారు.

“పాలమూరు అభివృద్ధి కోసం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. పాలమూరును అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పాలమూరులో వెలుగులు నింపాలని, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ ట్రిపుల్ ఐటీతో పాటు వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించాం. పాలమూరు జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణాలు సాగునీటి సౌకర్యాలు కల్పించకపోవడం, విద్యావకాశాలు లేకపోవడమే. చదువులకు అవసరమైన నిధులు అందించే బాధ్యత తనదే.

ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు రావాలంటే కేంద్రంలో ప్రధానమంత్రి గారిని కలవాల్సిందే. గ్రామంలో అభివృద్ధి జరగాలంటే సర్పంచులు ఎంత కీలకమో, దేశంలో అభివృద్ధి జరగాలంటే ప్రధానమంత్రి గారు అంతే కీలకం. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడబోం. తెలంగాణకు IIM సాధించుకుని దాన్ని మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, ప్రధానమంత్రి మోదీని కలిసి జిల్లాలోనే స్థాపించుకుందాం.

విద్య, నీటిపారుదల రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. పాలమూరు - రంగారెడ్డి, ఎస్సెల్‌బీసీ, జూరాల ప్రాజెక్టులలో పెండింగ్ పనులు, ఆర్డీఎస్ పనులను పూర్తి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడెక్కడ ఆర్ అండ్ ఆర్ పెండింగ్‌లో ఉందో అక్కడ ముందుగా సమస్యలను పరిష్కరిస్తాం. నిరక్షరాస్యత, పేదరికం తనకు శత్రువులు. మహిళలకు అన్యాయం చేసే వారు, విద్యార్థులకు నష్టం కలిగించే వారు తన శత్రువులు. చదువుకు అడ్డు తగిలే వారిని సహించబోం. పేదరిక నిర్మూలన తన ప్రధాన బాధ్యత. పేదరికాన్ని తెలంగాణ సరిహద్దుల వరకూ తరిమివేయడమే తన లక్ష్యం. అందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి. రాజకీయాలకు అతీతంగా పాలమూరును అభివృద్ధి చేసుకుందాం.

ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులు తప్ప గత పదేండ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు కాలేదు. బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, జూరాల, పాలమూరు - రంగారెడ్డి, కల్వకుర్తి వంటి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్ధండాపూర్ భూసేకరణకు నిధులు ఇచ్చాం. సంగంబండ కోసం 10 కోట్ల రూపాయలు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం 75 కోట్ల రూపాయలు విడుదల చేశాం. మక్తల్ –నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 1500 కోట్ల రూపాయల మంజూరు చేశాం. ఈ ప్రాజెక్టు కింద 96 శాతం భూమి కోల్పోయే రైతులను ఒప్పించి, మెప్పించి, నష్టపరిహారం నూటికి నూరు శాతం చెల్లించి ప్రజల ఆమోదం తీసుకున్నాం..” ముఖ్యమంత్రి వివరించారు.

Next Story