గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడని, ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన అరుదైన కళాకారుడని, వారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు 70 ఏండ్ల వయసులో అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. నేడు మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అందరినీ అలరించే ఆయన ఈసారి పండగ ముందే మృత్యుఒడికి చేరడంతో ఆదివాసీ గూడేల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి 2021 లో కనగరాజుకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రదానం చేసింది.