తెలంగాణలో మాంసాహార ప్రియులకు చేదువార్త. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను నిరవధికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ (మార్జిన్) మొత్తాన్ని భారీగా తగ్గించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.
గత రెండు దశాబ్దాలుగా కిలో చికెన్‌పై రూ.26 మార్జిన్ లభిస్తుండగా, కంపెనీలు దానిని ఒక్కసారిగా రూ.16కు తగ్గించడాన్ని రిటైల్ వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల దృష్ట్యా తమకు కిలోకు రూ.30 మార్జిన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 50 వేల షాపులు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ ఆకస్మిక బంద్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా చికెన్ సరఫరా నిలిచిపోయి, సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.