ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన అలవాట్లను కలిగి ఉంటారు. కొందరు పురాతన వస్తువులను సేకరించడానికి ఇష్టపడుతుంటారు. మరికొందరు వివిధ రకాల కలెక్షన్స్ చేయడం వారి అలవాటుగా పెట్టుకుంటారు. మరికొందరికి ఇతర దేశాల కరెన్సీలను జాగ్రత్త పరచడం అలవాటుగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన సంతోష్ కైలాశ్ కూడా అరుదైన నోట్లు, నాణేలు సేకరించడం అలవాటుగా ఉండేది.
1950లో 1/4 నాణెం (చార్ అణా) మార్కెట్లోకి వచ్చింది. ఈ నాణేన్ని అప్పట్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ విధంగా రిపబ్లిక్ డే రోజు మార్కెట్లోకి విడుదల చేసిన ఈ నాణేన్ని సంతోష్ కైలాష్ జాగ్రత్తగా భద్రపరిచాడు. అప్పుడు విడుదల చేసిన ఈ నాణేనికి 2021 రిపబ్లిక్ డే రోజుకు 70 సంవత్సరాలు నిండాయని సంతోష్ కైలాష్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ అరుదుగా లభించేటువంటి నోట్లు, నాణేలు సేకరించడం తనకు అలవాటుగా ఉందని, ఈ క్రమంలోనే ఈ నాణేన్ని సేకరించి భద్రపరిచానని తెలిపారు. ఈ విధంగా పలు రకాల వస్తువులను,నాణేలను భద్రపరచడం వల్ల భావితరాల వారికి వీటి విలువను చాటి చెప్పినట్లవుతుంది. ప్రస్తుతం ఉన్న ఈతరం పిల్లలు పావలా, పైసలను చూసి ఉండరని, ఈ విధంగా అరుదైన వస్తువులను భద్రపరచడం వల్ల ఎంతోమందికి వాటి విలువ తెలుసుకోవడానికి వీలు అవుతుందని తెలియజేశారు.