తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల స్వీకరణ తేదీల్లో రిక్రూట్‌మెంట్ బోర్డు మార్పులు చేసింది. 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 607 పోస్టులకు ఈ నెల 10 నుంచి 17వ తేదీల్లో దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా..ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకూ దరఖాస్తులు తీసుకోనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ నెల 20 నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు సమయంలో బోర్డు వెబ్‌సైట్‌లో అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల దృవీకరణ, తదితర సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కొంత సమయం కావాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది.