బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్‌తోనే మార్పు సాధ్యం..లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 130 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం ఒక కీలక పరిణామంగా మారింది.

By -  Knakam Karthik
Published on : 7 March 2026 6:00 PM IST

CM RevanthReddy, Maoist Surrender, Telangana Police, Surrender And Rehabilitate, Social Integration

బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్‌తోనే మార్పు సాధ్యం..లొంగిపోయిన మావోయిస్టులతో సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 130 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోవడం ఒక కీలక పరిణామంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, శాంతియుత మార్గాల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని, బుల్లెట్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారానే మార్పు సాధ్యమని స్పష్టం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు తమ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ముఖ్యంగా 75 ఏళ్ల వయసున్న అగ్రనేత గణపతి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లొంగిపోవాలని, ఆయన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే దేవ్ జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి వంటి నేతలతో చర్చలు జరిపి వారి సమస్యలను విన్నానని, మావోయిస్టుల డిమాండ్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో లొంగుబాటు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఈ ప్రక్రియలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. లొంగిపోయిన వారికి రివార్డులు, పునరావాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు మరియు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

2024 జనవరి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారికి మెరుగైన ఆర్థిక ప్యాకేజీని అందించే అంశంపై అధికారులతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో హింసకు తావులేదని, ఆయుధాలతో బెదిరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story