చంద్రబాబును ఇబ్బంది పెడితే.. జగన్‌కే నష్టం: బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నిరసనకు దిగారు.
By అంజి
చంద్రబాబును ఇబ్బంది పెడితే.. జగన్‌కే నష్టం: బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నిరసనకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. కక్షపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జగన్ ఎల్లకాలం సీఎంగా ఉండరు. ఏ ఆధారంతో చంద్రబాబును అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి' అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమన్న మోత్కుపల్లి.. నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకు పోవాల్సిందేనన్నారు. 2019లో జగన్‌ని గెలిపించమని ప్రజలను కోరి పొరపాటు చేశానన్నారు.
అప్పట్లో సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు ఇచ్చినందుకు తలదించుకుంటున్నానని అన్నారు. ఎవర్ని ఎలా తొక్కాలి, ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన అని మోత్కుపల్లి మండిపడ్డారు. సీఎం జగన్‌కు నారా భువనేశ్వరి ఉసురు కచ్చితంగా తగులుతుందన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా ఎల్లకాలం ఉండరని గుర్తుంచుకోవాలన్నారు. నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేయాలనుకోవడం అన్యాయమన్నారు. ముష్టి రూ.300 కోట్లకు చంద్రబాబు ఆశపడతాడంటే ప్రజలు నమ్మడం లేదన్నారు.
చంద్రబాబును ఇబ్బంది పెడితే రాజకీయంగా జగన్‌కే నష్టమని మోత్కుపల్లి హితవు పలికారు. జగన్ మళ్లీ గెలిస్తే.. ఆంధ్రప్రదేశ్ రావణకాష్‌టం కావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో 151 కాదు కదా.. నాలుగు సీట్లు కూడా జగన్‌కు రావని ఎద్దేవా చేశారు. తల్లి, చెల్లిని ఎన్నికల్లో వాడుకుని బయటకు పంపిన చరిత్ర జగన్‌ది అంటూ మోత్కుపల్లి దుయ్యబట్టారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా కట్టుబట్టలతో షర్మిలను బయటకు పంపాడని మోత్కుపల్లి ఆరోపించారు. జగన్ కపట ప్రేమను దేవుడు కూడా క్షమించడని, జగన్ పాలనలో ఏపీలో దళితలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.