క‌రోనా వేళ‌.. తెలంగాణ ప్ర‌భుత్వానికి శుభ‌వార్త చెప్పిన కేంద్రం

Centre hikes oxygen quota to Telangana. క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా చేస్తున్న ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్ల సరఫరాను పెంచాల‌ని నిర్ణ‌యించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 May 2021 3:45 AM GMT
Centre hikes oxygen

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి స‌ర‌ఫ‌రా చేస్తున్న ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక్సీన్ల సరఫరాను పెంచాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌కు 5,500 రెమిడిసివర్ల ఇంజక్షన్లు ఇస్తుండ‌గా.. సోమ‌వారం నుంచి వాటి సంఖ్యను 10,500కి పెంచుతున్న‌ట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి చెప్పారు. ఇక ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను పెంచాల‌ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా 200 టన్నుల ఆక్సీజన్ ను సరఫరా చేయనున్నట్టు చెప్పారు.

ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని భిలాయ్‌, ఒడిశాలోని అంగుల్‌, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ నుంచి తెలంగాణకు ఆక్సిజన్‌ను సరఫరాచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా సీఎంను కోరారు. వ్యాక్సీన్లను కూడా పెద్దమొత్తంలో తెలంగాణకు సరఫరా చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సెకండ్ డోస్ కు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా కేంద్రమంత్రిని సీఎం ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెకండ్ డోస్ కే ప్రాధాన్యతనిస్తున్నదని సీఎం చెప్పారు.

పొరుగు రాష్ర్టాల నుంచి కరోనా రోగులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌, రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లోని ఆస్ప‌త్రుల్లో చేరుతుండటంతో వైద్యారోగ్య వ్యవస్థపై తీవ్రభారం పడింది. దీంతో ఉన్న వనరులనే రాష్ట్ర ప్రజలతోపాటు పొరుగు రాష్ర్టాల రోగులకు కూడా సర్దాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు తమకు కేటాయిస్తున్న ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, వ్యాక్సిన్ల కోటాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో కేంద్రాన్ని కోరుతున్నది.


Next Story