ప్రధానమంత్రి మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గర్వకారణమని మోదీని అభినందించారు. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్, కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాల నిర్మాణానికి ఢిల్లీలో ప్రతిపాదించిన సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టు శంకుస్థాపనకు సుప్రీం కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఇప్పుడే ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేత పనులు చేపట్టవద్దని ఆదేశించింది.
ఈ ప్రాజెక్టు మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేత పనులు చేపట్టవద్దని సూచించింది. కాగా, కేంద్రం తరపున వాదనలు వివినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని తెలిపారు. ఈ కొత్త బవనాల నిర్మాణం వల్ల అద్దె రూపంలో చెల్లిస్తున్న సొమ్ము ఆదా అవుతుందని వివరించారు.