తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య (88) నిన్న(శనివారం) అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు నేడు(ఆదివారం) ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కడసారి చూసి.. నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, నటుడు చిరంజీవి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అమీర్‌పేటలోని రోశయ్య నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. రోశయ్యతో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ఇక రోశయ్య మృతి విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 'మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యగారి మరణం తీరని విషాదం. ఆయన రాజకీయాల్లో భీష్మాచార్యుడు వంటివారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఆయన రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజల మన్ననలు పొందారు. ఆయన మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చిరు ట్వీట్ చేశారు.