ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
CBI issues notice to Kavitha in Delhi liquor scam.ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం
By తోట వంశీ కుమార్ Published on 3 Dec 2022 2:45 AM GMTఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శుక్రవారం రాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపింది. ఈ నెల 6న ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపింది. హైదరాబాద్ లేదా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయాల్లో వెసులుబాటును బట్టి ఏదో ఒకచోట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ ఇచ్చిన రాత పూర్వక ఫిర్యాదు మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు 14 మందిపై కేసు నమోదైనట్లు కవితను విచారణకు పిలిచినట్లు నోటీసులో తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి విచారణకు హాజరుకావాలన్నారు. సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ సాహి పేరుమీద ఈ నోటీసులను జారీచేశారు.
రెండు రోజుల క్రితమే (నవంబరు 30న రాత్రి) ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేర్చింది. ఈ పరిణామం చోటుచేసుకున్న రెండు రోజుల్లోనే సీబీఐ నుంచి కవితకు నోటీసులు ఇష్యూ కావడం గమనార్హం.
వివరణ కోసమే నోటీసులు..
"నా వివరణ కోరుతూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. వారి అభ్యర్థన మేరకు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని నా నివాసంలో కలుసుకోవచ్చునని అధికారులకు తెలియజేశా. ఇంటివద్దే వారికి వివరణ ఇస్తా "అని కవిత తెలిపారు.