అందుకే తెలంగాణలో కులగణన చేయించారు: ఈటల
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By అంజి
అందుకే తెలంగాణలో కులగణన చేయించారు: ఈటల
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన చట్టపరమైన, శాస్త్రీయ మద్దతు లేకుండా రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో కుల గణన నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం రెండోసారి సర్వే నిర్వహించాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే తమిళనాడు, బీహార్‌లో అనుసరిస్తున్న విధానాల మాదిరిగానే చట్టబద్ధంగా పటిష్టమైన కమిషన్‌ను ఏర్పాటు చేసి కుల గణనను శాస్త్రీయంగా నిర్వహించాలని రాజేందర్ డిమాండ్ చేశారు.
ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి మద్దతుగా నిర్వహించిన సభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుల గణనలో బీసీ జనాభాలో వచ్చిన మార్పులను రాజేందర్ ప్రశ్నించారు. బీసీ జనాభా తగ్గుదలపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం తొమ్మిదేళ్ల తర్వాత ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కోగా, రేవంత్ రెడ్డి పరిపాలన మొదలెట్టిన తొమ్మిది నెలల్లోనే వ్యతిరేకతను ఎదుర్కొందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ కులం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి మానుకోవాలని రాజేందర్ హితవు పలికారు.