బీసీలను మోసం చేసేందుకే నివేదిక..కులగణన సర్వేపై తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.
By Knakam Karthik Published on 4 Feb 2025 5:34 PM ISTబీసీలను మోసం చేసేందుకే నివేదిక..కులగణన సర్వేపై తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్
బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ తమపై విమర్శలు చేయడం తగదని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు సమగ్రంగా కుటుంబ సర్వే నిర్వహించామని చెప్పారు. చిన్న లొసుగులతో సర్వేనే తప్పుబట్టడం సరికాదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై పరోక్షంగా మహేష్ కుమార్ స్పందించారు. తీన్మార్ మల్లన్న సర్వేను వ్యతిరేకిస్తే.. రాహుల్ గాంధీని కూడా వ్యతిరేకిస్తున్నాడా అని ప్రశ్నించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
శాసనమండలిలో ప్రవేశపెట్టిన కుల గణన సర్వేపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన లెక్కలు.. కుల గణనకు పొంతన లేదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ జరగదు అని అన్నారు. 4 కోట్లకు పైగా ఉండాల్సిన రాష్ట్ర జనాభా సర్వేలో తగ్గిందని ఆయన తెలిపారు. బీసీల జనాభా తగ్గి ఓసీల జనాభా ఎలా పెరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు 2011 జనాభా లెక్కలు తీసుకున్నారని విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ అమలుకు ప్రస్తుత సర్వే లెక్కలు తీసుకున్నారని దుయ్యబట్టారు. ఇది పూర్తిగా బీసీలను మోసం చేసేందుకే ప్రభుత్వం తయారు చేసిన నివేదిక అని.. తీన్మార్ మల్లన్న ఆరోపించారు.