బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై కేసు న‌మోదు

Case Filed against on BJP MLA Raghunandan Rao.దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై పోలీసులు కేసు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2022 4:17 AM GMT
బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై కేసు న‌మోదు

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అత్యాచార ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఫోటోలు, వీడియోలు బ‌హిర్గ‌తం చేయ‌డంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(a) సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయాల‌ని బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు ప్రశ్నించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి నిందితుల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను మీడియాకు చూపించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌లో మైన‌ర్లు ఉన్నారని, వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎలా చూపిస్తారంటూ ర‌ఘునంద‌న్‌పై ప‌లువురు విమ‌ర్శ‌లు చేశారు.

దీనిపై స్పందించిన ర‌ఘునంద‌న్ తాను ఎవ‌రీ పేరును ప్ర‌స్తావించ‌లేద‌ని, ఎవ‌రిముఖం క‌నిపించే విధంగా ఫోటోలు, వీడియోలు విడుద‌ల చేయ‌లేద‌న్నారు. కాగా.. ఐపీసీ228(a) ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలి పేరు. ఫోటోలు, ఆధారాల‌ను బ‌య‌ట‌పెడితే సుప్రీం కోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం నేరంగా ప‌రిగ‌ణిస్తారు. మ‌రి కేసు నమోదైన నేప‌థ్యంలో ర‌ఘునంద‌న్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే.. బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన పాతబస్తీకి చెందిన సుభాన్‌ అనే రిపోర్టర్‌కు సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇప్ప‌టికే నోటీసులు జారీ చేశారు. అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయటకు రావొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలున్నా, కారులోని వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలు ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ఎలా బయటకు వచ్చాయనే విషయాలపై స్పష్టత వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు సిద్దం అయ్యారు.

Next Story