'రేపు విచారణకు హాజరు కాలేను'.. సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ
'Can't meet on Dec 6', TRS MLC Kavitha writes to CBI. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవిత తన ముందస్తు షెడ్యూల్
By అంజి Published on 5 Dec 2022 6:00 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవిత తన ముందస్తు షెడ్యూల్ కారణంగా డిసెంబర్ 6న విచారణకు హాజరుకాలేనని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కి సోమవారం లేఖ రాసింది. డిసెంబర్ 11, 12 లేదా డిసెంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారణ జరపవచ్చని ఆమె కేంద్ర ఏజెన్సీకి తెలియజేశారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అలాగూ ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్‌లో నిందితుల జాబితాలో తన పేరు లేదని కవిత లేఖ రాశారు.
ఈ కేసులో వివరణ కోరుతూ డిసెంబర్ 2న సీబీఐ నుండి నోటీసు అందుకున్న ఒక రోజు తర్వాత.. ఎమ్మెల్సీ కవిత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఎఫ్‌ఐఆర్ నుండి ఫిర్యాదు కాపీలను కోరుతూ ఏజెన్సీకి లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ కాపీ, ఫిర్యాదు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని సీబీఐ ఈ మెయిల్ ద్వారా ఆమెకు తెలిపింది. ''నేను ఎఫ్‌ఐఆర్‌లోని కంటెంట్, నిందితుల జాబితాతో పాటు 22-07-2022 నాటి ఫిర్యాదులోని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాను, అందులో తన పేరు ఎక్కడా లేదు'' అని కవిత సోమవారం ఉదయం సీబీఐ అధికారికి లేఖ రాశారు.
''మీరు ప్రతిపాదించినట్లుగా నేను 6 డిసెంబర్ 2022న కలుసుకునే స్థితిలో లేను. నా ముందస్తు షెడ్యూల్ కారణంగా, ఈ నెల 11, 12 లేదా 14, 15 తేదీల్లో మీకు ఏది అనుకూలమో ఆ రోజు హైదరాబాద్‌లోని నా నివాసం వద్ద నేను మిమ్మల్ని కలవగలుగుతాను. దయచేసి వీలైనంత త్వరగా ధృవీకరించండి'' అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. అలాగే విచారణకు సహకరిస్తామని కవిత హామీ ఇచ్చారు. ''నేను చట్టాన్ని గౌరవించే పౌరురాలిని, విచారణకు సహకరిస్తాను, విచారణకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీలలో ఏ రోజైనా నేను మిమ్మల్ని కలుస్తాను.'' అని చెప్పారు.
ఈ కేసు సంబంధించి వివరణ కోరుతూ సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద సిబిఐ ఎమ్మెల్సీ కవిత నోటీసు జారీ చేసిందని టిఆర్‌ఎస్ నాయకుడు డిసెంబర్ 2న ధృవీకరించారు. 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఆరోపణలు నేపథ్యంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 14 మందిపై భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ తన నోటీసులో పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ కోసం బుధవారం ఢిల్లీ కోర్టులో ఈడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో నవంబర్ 30న కవిత పేరు బయటకు వచ్చింది. రిమాండ్ రిపోర్టు ప్రకారం, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వ్యాపారవేత్త విజయ్ నాయర్ 'సౌత్ గ్రూప్' అనే గ్రూప్ నుంచి ఆప్ నేతల తరపున రూ.100 కోట్లు అందుకున్నారని తెలిసింది. రిపోర్టు ప్రకారం.. ఈ బృందాన్ని శరత్ రెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించారు. ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా డైరెక్టర్లలో ఒకరైన శరత్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి చెందిన ఎంపీ.