రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దైన రైళ్ల వివరాలిలా.. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా.. 9 రైళ్లను దారి మళ్లించారు.
By అంజి
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
హైదరాబాద్: ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దైన రైళ్ల వివరాలిలా.. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా.. 9 రైళ్లను దారి మళ్లించారు.
అలాగే ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయిని భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 11 రోజుల పాటు నిలిచిపోనుంది. 3వ లైన్ పనుల కారణంగా సికింద్రాబాద్ - కాగజ్‌నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిలిపివేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ వరకు దీనిలో నిత్యం ప్రయాణించేవారుంటారు. దీంతో ఉద్యోగులు, వ్యాపారులకు తిప్పలు తప్పేలా లేవు.
సికింద్రాబాద్ నుంచి గుంటూరు మధ్య గోల్కొండ, సికింద్రాబాద్- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లు వారం నుంచి 11 రోజుల పాటు రద్దయ్యాయి. దీంతో పాటు కాజీపేట- విజయవాడ సెక్షన్‌లో జరుగుతున్న పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేశామని వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించి నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 20 వరకు విశాఖ- ఎల్‌టీటీ(18519), 12 నుంచి 22 వరకు ఎల్‌టీటీ-విశాఖ (18520), 13న టాటానగర్-యశ్వంత్‌పూర్(18111), 9, 16న యశ్వంత్‌పూర్- టాటానగర్(18112) రైళ్లు రద్దయ్యాయి.
ఈనెల 17, 19 తేదీల్లో షాలిమార్- హైదరాబాద్ (18045), 18, 20 తేదీల్లో హైదరాబాద్- షాలిమార్ (18046) రైళ్లను వయా సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా నడపనున్నారు. 17 నుంచి 19 వరకు ముంబయి- భువనేశ్వర్- ముంబయి (11019- 11020) రైళ్లను వయా విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, వాడి స్టేషన్ల మీదుగా, 19న షాలిమార్- సికింద్రాబాద్ (22849) రైలు వయా విశాఖ, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించి నడుపనున్నారు.
ఈనెల 19, 20 తేదీల్లో విశాఖ- సికింద్రాబాద్ (20833) వందేభారత్ రైలు ఉదయం 5:45 గంటలకు బదులుగా 7 గంటలకు బయలుదేరేలా మార్పు చేశారు. భద్రతాపరమైన కారణాలతో విశాఖ- కిరండూల్ మధ్య నడిచే రైళ్లను దంతెవాడ వరకు కుదించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 9 నుంచి 11 వరకు విశాఖ- కిరండూల్(58501), 10 నుంచి 12 వరకు కిరండూల్- విశాఖ (58502), 8 నుంచి 11 వరకు విశాఖ- కిరండూల్ (18514), 9 నుంచి 12 వరకు కిరండూల్- విశాఖ(18513) రైళ్లు దంతెవాడ వరకే రాకపోకలు సాగిస్తాయి.