క్యాడ్‌బరీ చాక్లెట్లు తినడానికి సురక్షితం కాదు: తెలంగాణ స్టేట్ ఫుడ్‌ ల్యాబ్‌

క్యాడ్‌బరీ డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో తెల్ల పురుగులు కనుగొన్న తర్వాత.. క్యాడ్‌బరీ చాక్లెట్ తినడానికి సురక్షితం కాదని తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల ప్రకటించింది.

By అంజి  Published on  28 Feb 2024 7:19 AM GMT
Cadbury chocolates, Telangana, Food Lab,

క్యాడ్‌బరీ చాక్లెట్లు తినడానికి సురక్షితం కాదు: తెలంగాణ స్టేట్ ఫుడ్‌ ల్యాబ్‌

హైదరాబాద్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌ విక్రయిస్తున్న క్యాడ్‌బరీ డైరీ మిల్క్‌ చాక్లెట్‌లో తెల్ల పురుగులు కనుగొన్న తర్వాత.. క్యాడ్‌బరీ చాక్లెట్ (కాల్చిన బాదం) తినడానికి సురక్షితం కాదని తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల ప్రకటించింది. చాక్లెట్‌లో పురుగులను కనుగొన్న బాధితుడు రాబిన్ జాచెయస్ చేసిన ప్రయత్నాలకు రాష్ట్ర ప్రయోగశాల స్పందించింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సూపర్ మార్కెట్ నుండి కొనుగోలు చేసిన చాక్లెట్‌లో ఒక పురుగు పాకుతున్నట్లు రాబిన్‌ గుర్తించిన తర్వాత ఇదంతా ప్రారంభమైంది.

హైదరాబాద్‌కు చెందిన రాబిన్ అమీర్‌పేట్‌లో మెట్రో స్టేషన్‌లోని ఓ సూపర్ మార్కెట్లో ఫిబ్రవరి 9న డెయిరీ మిల్క్ చాక్లెట్ కొనుగోలు చేశాడు. దాన్ని ఇంటికి తీసుకువచ్చి ఓపెన్ చేసి చూడగా షాక్‌కి గురయ్యాడు. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్‌పై పురుగు ఉన్న వీడియోను షేర్ చేశాడు. డెయిరీ మిల్క్‌లో పురుగు రావడాన్ని హైదరాబాద్‌లోని సూపర్ మార్కెట్, క్యాడ్‌బరీ సంస్థని రాబిన్‌ ప్రశ్నించారు, గడువుకు దగ్గరగా ఉన్న ఉత్పత్తులకు నాణ్యత తనిఖీలు, ప్రజారోగ్య ప్రమాదాలకు బాధ్యత గురించి అడిగారు. “గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు?'' అని ఎక్స్‌లో రాబిన్‌ని ప్రశ్నించారు.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), క్యాడ్‌బరీ డైరీ మిల్క్, సూపర్ మార్కెట్ రత్నదీప్‌ను ట్యాగ్ చేస్తూ, అతను తన కొనుగోలు బిల్లు యొక్క ఫోటోను పంచుకున్నాడు. రాబిన్‌ ఫిర్యాదు తర్వాత క్యాడ్‌బరీ స్పందిస్తూ ట్వీట్ చేసింది. “హాయ్.. మోండెలెజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో క్యాడ్‌బరీ ఇండియా లిమిటెడ్) అత్యధిక నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది. మీకు అసహ్యకరమైన అనుభవాన్ని కలిగి ఉన్నందుకు మేము చింతిస్తున్నాము. మీ ఆందోళనను పరిష్కరించడానికి మాకు సహాయం చేయండి. దయచేసి మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, కొనుగోలు వివరాలను మాకు అందించడానికి Suggestions@mdlzindia.comకు మెయిల్‌ చేయండి. మీ ఫిర్యాదుపై చర్య తీసుకునేలా చేయడానికి మేము ఈ వివరాలన్నింటినీ కోరతాము. ధన్యవాదాలు'' అని క్యాడ్‌బరీ డైరీ మిల్క్‌ పేర్కొంది.

జీహెచ్‌ఎంసీ కూడా ఈ ఘటనపై చర్య తీసుకుంది. ఈ సమస్యపై సంబంధిత ఆహార భద్రత బృందాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. తరువాత, తెలంగాణ రాష్ట్ర ఆహార ప్రయోగశాల కూడా హైదరాబాద్ సూపర్ మార్కెట్ నుండి కొనుగోలు చేసిన క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ (రోస్ట్ ఆల్మండ్), క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ (ఫ్రూట్ & నట్) నమూనాలను పరీక్షించారు. హైదరాబాద్‌లోని సూపర్‌మార్కెట్‌లో విక్రయించే క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్‌లలో తెల్లటి పురుగులు కనిపించడంతో అవి సురక్షితం కాదని పరీక్షల్లో తేలింది.

మోండెలెజ్ ఇండియా ప్రతినిధి వివరణ ఇదే..

మేము అంతర్జాతీయంగా ఆమోదం పొందిన HACCP (హాజర్డ్ అనాలిసిస్ & క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్) ప్రోగ్రామ్‌ను అనుసరిస్తాము. ఇది ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన ఆహార భద్రతా వ్యవస్థకు సంబంధించిన‌ది. మా ఉత్పత్తులు భౌతిక, రసాయన, సూక్ష్మజీవ సంబంధిత సమస్యల నుండి విముక్తి పొందేలా మా చర్యలు ఉంటాయి. ఇతర ఆహార ఉత్పత్తుల మాదిరిగానే చాక్లెట్‌ల సరఫరాలో పలు చర్యలు తీసుకుంటూ ఉంటాం. రిటైల్ గా అమ్మే సమయాల్లోనూ.. నిల్వ చేసే సమయంలోనూ నిర్దిష్ట శ్రద్ధ చాలా అవసరం. ప్రతి క్యాడ్‌బరీ లేబుల్‌ మీద- 'చల్లని, పరిశుభ్రమైన, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి' అని ఉంటుంది. మేము అదే బ్యాచ్ నమూనాలను.. అలాగే అదే సమయంలో తయారు చేసిన ఇతర బ్యాచ్‌ల చాకొలేట్లను కూడా పరీక్షించాము. వాటిలో ఎటువంటి సమస్యలు కనుగొనలేదు. ఉత్పత్తి సమయంలో ఏ మాత్రం ప్రభావితం కాలేదని మేము విశ్వసిస్తున్నాము. మా ఉత్పత్తుల నాణ్యత, వినియోగదారుల భద్రతకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మా వినియోగదారులు మా ఉత్పత్తులను ప్రేమిస్తున్నారని నిర్ధారించడానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాము.

Next Story