తెలంగాణ‌లో త్వ‌ర‌లో విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల పెంపు..!

Cabinet to clear increase in power tariff and RTC fares.తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sept 2021 8:58 AM IST
తెలంగాణ‌లో త్వ‌ర‌లో  విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల పెంపు..!

తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విధించిన లాక్‌డౌన్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఆర్టీసీ న‌ష్టాల్లో కూరుకుపోయింద‌ని.. ఈ సంక్షోభం నుంచి గ‌ట్టెక్కాలంటే చార్జీలు పెంచ‌క త‌ప్ప‌ద‌ని రవాణా శాఖ మంత్రి సహా ఆర్టీసీ చైర్మన్, ఎండీ, ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు నివేదించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం సీఎం ఆర్టీసీ, విద్యుత్ శాఖ‌ల‌పై స‌మీక్షించారు. ఈ స‌మావేశంలో మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజ‌య్‌కుమార్‌, జ‌గ‌దీశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్థ‌న్, సీఎస్ సోమేశ్‌కుమార్‌, ర‌వాణా, ఆర్థిక ప్రత్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు సునీల్ శ‌ర్మ‌, రామ‌కృష్ణారావు, ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌, ట్రాన్స్‌కో ఎండీ ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

గత ఏడాదిన్నర కాలంలో డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ.22 మేర పెరగటంతో ఆర్టీసీపై రూ.550 కోట్లు అదనపు ఆర్థికభారం పడుతున్నదని అధికారులు సీఎంకు వివరించారు. డీజిల్‌తో పాటు టైర్లు, ట్యూబులు తదితర బస్సు విడిభాగాల ధరలు పెరగటం వ‌ల్ల మ‌రో రూ.50కోట్ల మేర.. మొత్తంగా ఏడాదికి రూ,600కోట్ల అద‌న‌పు భారం ప‌డుతోంద‌న్నారు. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్టీసీ దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు.హైదరాబాద్‌ పరిధిలో నెలకు రూ.90 కోట్ల వరకు నష్టం వస్తున్నదని పేర్కొన్నారు. ఇటువంటి కష్టకాలంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. 2020 మార్చిలోనే అసెంబ్లీలో ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచుతామని ప్రకటించిందని అయితే.. కరోనా కారణంగా చార్జీలను పెంచలేదని ఈ సంద‌ర్భంగా అధికారులు కేసీఆర్‌కు గుర్తు చేశారు. చార్జీలు పెంచుకోవడానికి అనుమతిస్తే తప్ప.. ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదని అధికారులు సీఎం కేసీఆర్‌కు విన్న‌వించుకున్నారు.

కరోనా నేపథ్యంలో అన్ని రంగాల మాదిరిగానే విద్యుత్తు సంస్థలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌ సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావు సీఎంకు తెలిపారు. ఆరేళ్లుగా ధ‌ర‌లు స‌వ‌రించ‌లేద‌ని..విద్యుత్‌శాఖను గట్టెకించడానికి చార్జీలు పెంచాలని కోరారు.

ఆర్టీసీని పటిష్ఠ పరిచేందుకు రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టామ‌ని.. గాడిలో ప‌డుతుంద‌నుకొంటున్న స‌మ‌యంలో క‌రోనా, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల కార‌ణంగా తిరిగి న‌ష్టాల్లో కూరుకుపోవ‌డం బాధాక‌ర‌మ‌ని సీఎం అన్నారు. ఆర్టీసీని తిరిగి నిలబెట్టుకొనేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద‌ని తెలిపారు. ఆర్టీసీతో పాటు విద్యుత్తు అంశాలకు సంబంధించి రాబోయే క్యాబినెట్‌లో చర్చించి, తగు నిర్ణయం తీసుకొంటామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను క్యాబినెట్‌ సమావేశానికి తీసుకురావాలని.. రవాణా, విద్యుత్తు శాఖల మంత్రులను, అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.


Next Story