దసరా రద్దీ.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు

Bus stands and railway stations in Telangana are jammed with passengers during Dussehra festival. దసరా పండుగ సందర్భంగా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో నివసించే

By అంజి  Published on  2 Oct 2022 4:30 AM GMT
దసరా రద్దీ.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు

దసరా పండుగ సందర్భంగా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు.. పండుగ కోసం సొంతూళ్లకు పయనం అవుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను, రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అయితే రైల్వే శాఖ మాత్రం ప్రత్యేక రైళ్లకు.. తత్కాల్‌ ఛార్జీలను గుంజుతోంది. ఇక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అయితే దొరికిందే సందు అనుకుని.. ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే.. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని 315 స్పెషల్‌ ట్రైన్లను నడిపిస్తోందని ఎస్‌సీఆర్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ రాకేష్ తెలిపారు. ప్రయాణికుల కోసం కొన్ని రైలు సర్వీసులకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు రైళ్ల టైమింగ్స్‌ కంటే ముందుగానే స్టేషన్​కు చేరుకొని స్టేషన్ వద్ద పడిగాడుపులు కాస్తున్నారు. దీంతో స్టేషన్‌ వద్ద రద్దీ భారీగా పెరిగిపోయిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరోవైపు అన్ని రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయని ప్రయాణికులు వాపోతున్నారు.

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్‌ఆర్టీసీ 4,198 స్పెషల్ బస్సులను నడుపుతోంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,795 స్పెషల్‌ బస్సులను, ఏపీకి 328 బస్సులను, కర్ణాటకకు 75 బస్సులను నడుపుతోంది. హైదరాబాద్‌ నగరంలోని మెయిన్‌ బస్‌స్టేషన్లన్నీ ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ లతో పాటు దిల్‌సుఖ్‌ నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్​బీ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్.బీ.నగర్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున.. ఆర్టీసీ ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయటం లేదు. అయితే రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు పండుగ సీజన్‌ కావడంతో ప్రైవేట్‌ బస్సు నిర్వాహకులు ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ బస్సుల ఛార్జీలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్‌ వెహికల్స్‌ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Next Story
Share it