తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రయాణీకులపై మరోసారి డీజిల్ సెస్ భారాన్ని మోపింది. కిలో మీటరు ప్రాతిపదికన పల్లెవెలుగు నుంచి ఏసీ సర్వీసుల వరకు అన్నింటిపైనా ఛార్జీలను పెంచింది. తాజా పెంపు నేటి(గురువారం) తొలి సర్వీసు నుంచి అమల్లోకి వచ్చింది. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణీకులకు మాత్రం ఈ పెంపు నుంచి మినహాయింపునిచ్చింది. కాగా.. ఈ ఏడాది మార్చిలో డీజిల్ సెస్సు పేరుతో రూ.2 నుంచి రూ.5 పెంచిన సంగతి తెలిసిందే.
డీజిల్ భారం భరించలేకనే మరోసారి సెస్సును పెంచాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సగటున రోజుకు ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నామని, ప్రస్తుతం రోజుకు రూ.5కోట్ల నష్టం వస్తోంది. త్వరలో విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీలను కూడా పెంచుతాం. 2019 తరువాత ఆ విభాగంలో ఛార్జీలు పెంచలేదు. పాసుల గడువు ముగిసే వరకు పాత విధానమే అమలులో ఉంటుందని వారు తెలిపారు.
తాజా పెంపు ఇలా..
- పల్లె వెలుగు సర్వీసుల్లో 250 కి.మీ దూరానికి రూ.5 నుంచి రూ.45 వరకు
- ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 500 కి.మీ దూరానికి రూ.5 నుంచి రూ.90 వరకు
- డీలక్స్ సర్వీసుల్లో 500 కి.మీ వరకు దూరానికి రూ.5 నుంచి రూ.125
- సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 500 కి.మీ వరకు దూరానికి రూ.10 నుంచి రూ.130
- ఏసీ సర్వీసులు సర్వీసుల్లో 500 కి.మీ వరకు దూరానికి రూ.10 నుంచి రూ.170 కు పెంచారు.