బీఆర్ఎస్‌ శాసన సభాపక్ష నేతగా కేసీఆరే..!

బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఉంటారా? లేదా మరెవరైనా ఉంటారా? అనేదానిపై మూడ్రోజులుగా చర్చ జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 7:49 AM IST
brslp leader, kcr, telangana, assembly ,

బీఆర్ఎస్‌ శాసన సభాపక్ష నేతగా కేసీఆరే..!

బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఉంటారా? లేదా మరెవరైనా ఉంటారా? అనేదానిపై మూడ్రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే.. బీఆర్ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కేసీఆరే ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారట. అందుకే ఆయన్నే ఎమ్మెల్యేలంతా శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. కేసీఆర్‌కు కాలుకి గాయం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశంలో అందరూ కలిసి.. పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్‌ను ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదట కేసీఆర్‌ కాకుండా బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా మరొకరు ఉంటారని వార్తలు వినిపించాయి. అందులో కేటీఆర్, హరీశ్‌రావు లేదంటే కడియం శ్రీహరి ఎల్పీ లీడర్‌గా ఉంటారని అన్నారు. కానీ.. అసెంబ్లీలో అధికార పార్టీ కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కేసీఆర్‌ బరిలోకి దిగాలని.. కేసీఆర్ ఆధ్వర్యంలోనే తామూ ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలంతా అంటున్నారు. అందుకే కేసీఆర్‌ బరిలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా.. కాలికి ఆపరేషన్‌ కారణంగా ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీకి హాజరుకాలేరు. అయినా.. కేసీఆర్‌నే తమ నేతగా ఎంపిక చేసుకోవాలని ఎమ్మెల్యేలంతా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు మరో రెండు నెలల వరకు రెస్ట్‌ అవసరమని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలోపు అసెంబ్లీ సమావేశాలు జరిగితే.. ఉప నేతలుగా ఎన్నికయ్యే వారు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. కానీ.. అధికారికంగా ప్రతిపక్ష నేతగా మాత్రం కేసీఆరే ఉండనున్నారు.

Next Story