పదవీ విరమణ చేస్తున్న సర్పంచ్‌లకు కృతజ్ఞతాభివందనాలు: కేటీఆర్

తెలంగాణలో పదవీ విరమణ చేస్తోన్న సర్పంచ్‌లకు కేటీఆర్ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  1 Feb 2024 2:31 PM IST
brs,  ktr, tweet, sarpanch retirement,

పదవీ విరమణ చేస్తున్న సర్పంచ్‌లకు కృతజ్ఞతాభివందనాలు: కేటీఆర్ 

తెలంగాణలో పదవీ విరమణ చేస్తోన్న సర్పంచ్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. జనవరి 31వ తేదీతో రాష్ట్రంలో ఉన్న సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. దాంతో.. సర్పంచ్‌ల పదవీకాలం పొడగించడమా? లేదంటే ఎన్నికలు నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రత్యేక కార్యదర్శులను నియమించడంపైనా పరిశీలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఇంతకాలం ప్రజలకు సేవలందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఐదేళ్ల పాటు తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగా సేవ చేసిన గ్రామ సర్పంచ్‌లు పదవీ విరమణ చేస్తున్న వేళ వారికి కృతజ్ఞతాభివందనలు అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలను నిర్మించుకున్నామని గుర్తు చేశారు. గ్రామీణాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచామని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో సర్పంచ్‌ల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. సర్పంచ్‌ పదవికి కేవలం విరమణ మాత్రమే అని.. ప్రజా సేవకు కాదని అన్నారు. మరింత కాలం ప్రజా సేవలో ఉండాలని ఆశిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

సర్పంచ్‌ కోసం ఎక్స్‌లో కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. బీఆర్ఎస్ హాయంలో గ్రామాల్లో జరిగిన అభివృద్దిని గురించి తెలుపుతున్న ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. ఒక ఊరు.. అనేక పథకాలు అంటూ ఈ ఫోటో తెలుపుతోంది. ఊర్లో ఉన్న వైకుంఠదామం, డంప్‌యార్డు, ప్రకృతి వనం, మిషన్ భగీరథ ట్యాంకు, విశాలమైన రోడ్లు, డబుల్‌బెడ్రూం ఇళ్ల సముదాయం, మిషన్ కాకతీయ చెరువు, హరితహారం వంటి పథకాలను తెలియజేస్తోంది.


Next Story