50వేల మంది రైతులతో పంప్‌హౌస్‌లు ఆన్ చేస్తాం: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు.
By Srikanth Gundamalla Published on 26 July 2024 8:30 AM GMT50వేల మంది రైతులతో పంప్‌హౌస్‌లు ఆన్ చేస్తాం: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే నెల 2వ తేదీ లోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే 50వేల మంది రైతులతో వచ్చి తామే పంప్ హౌసలను ఆన్ చేస్తామని చెప్పారు. తెలంగాణ బీడు భూములను నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు కాళేశ్వరం పంప్‌హౌస్‌లు ఆన్ చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు కేటీఆర్. తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రస్తుతం పంటల సాగు కోసం నీరు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. గతంలో నీటి సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, కాని గతంలో అలాంటి సమస్య లేదని అన్నారు కేటీఆర్.
50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టుకున్నామన్నారు కేటీఆర్. లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూడు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారని మండిపడ్డారు. పది లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా కిందకు పోతున్నాయనీ.. కాళేశ్వంరం దగ్గర గోదవారి ఉధృతంగా ప్రవహిస్తున్నదని చెప్పారు. రిజర్వాయర్లు మాత్రం గొంతెండి ఎడారిలాగా మారాయన్నారు. ప్రభుత్వం తలచుకుంటే 18 లక్షల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని అన్నారు. నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.