జనవరి 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ
BRS to Hold Public Meeting in Khammam on January 18. ఖమ్మం వేదికగా బీఆర్‌ఎస్ శంఖారావం పూరించనుంది. జాతీయ రాజకీయాల్లోకి
By అంజి
ఖమ్మం వేదికగా బీఆర్‌ఎస్ శంఖారావం పూరించనుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి జనవరి 18 న ఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించబోతోంది. టీఆర్‌ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ మొదటి బహిరంగ సభ ఇది. ఈ సభకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ సమావేశానికి ఢిల్లీ సీఎం అరవింద్ ఖేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌లను ఆహ్వానించనున్నట్లు సమాచారం. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సభలో పాల్గొననున్నారు.
జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్ సత్తా చాటేలా, విపక్షాల ఐక్యతను తెలిపేలా ఖమ్మం సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. కాగా ఖమ్మం సభ ద్వారా దేశంలోని రైతులకు, రాజకీయ పక్షాలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. వ్యవసాయ రంగంలో తీసుకొచ్చే మార్పులపై ఈ సభలో వివరించనున్నట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ ఏర్పాటు ఆవశ్యకతపై ప్రజలకు, యావత్ దేశానికి తన సందేశాన్ని ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్.
ఇదిలా ఉంటే.. జనవరిలో మరో మూడు కొత్త సమీకృత కలెక్టరేట్ సముదాయాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్‌ను జనవరి 12న ప్రారంభించనున్న కేసీఆర్.. అదే రోజు (జనవరి 12) మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సంక్రాంతి తర్వాత జనవరి 18న ఖమ్మం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.
'అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ను ప్రారంభించారు. అక్టోబర్ 10న దసరా రోజున టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబర్ 8ప బీఆర్‌ఎస్‌కు ఆమోదం తెలుపుతూ ఈసీ ఆమోదం తెలిపింది.