వంద రోజుల్లోనే విద్యుత్, నీటికష్టాలు మొదలయ్యాయి: తలసాని
కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనతోనే రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 26 March 2024 6:00 PM ISTవంద రోజుల్లోనే విద్యుత్, నీటికష్టాలు మొదలయ్యాయి: తలసాని
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారాన్ని కోల్పోయింది. అయితే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తాను చాటి మెజార్టీ సీట్లను సాధించాలని చూస్తోంది. తద్వారా ఉనికిని చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎలాగైనా ప్రతి అభ్యర్థి గెలవాలనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని పలు సూచనలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనతోనే రాష్ట్ర ప్రజలు విసుగు చెందారంటూ మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గతంలో కేసీఆర్ అందించిన ఆదర్శవంతమైన పాలన గురించి గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ సీఎంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వంద రోజుల్లోనే ప్రజలకు విద్యుత్, నీటి కష్టాలు మొదలు అయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచిపోయిందంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో పాల్గొనాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందొద్దని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్‌ను మెజార్టీతో గెలిపించుకుందామని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.