బీఆర్‌ఎస్‌ పేరును.. కుటుంబ రాష్ట్ర సమితిగా మార్చాల్సింది: ఫడ్నవీస్‌

బీఆర్‌ఎస్‌ అని పేరు పెట్టే బదులు 'ఎఫ్‌ఆర్‌ఎస్'- ఫ్యామిలీ రాష్ట్ర సమితి అని పేరు పెట్టి ఉండాల్సిందని తాను భావిస్తున్నానని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

By అంజి  Published on  22 Nov 2023 6:37 AM IST
BRS, Family Rashtra Samithi, Devendra Fadnavis, Telangana Polls

బీఆర్‌ఎస్‌ పేరును.. కుటుంబ రాష్ట్ర సమితిగా మార్చాల్సింది: ఫడ్నవీస్‌

తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బీఆర్‌ఎస్‌ పార్టీ 'కుటుంబ పాలన', అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దోమల్‌గూడలో జరిగిన ప్రచార సభలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ''గత తొమ్మిదేళ్లుగా మీరు ఇక్కడ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని చూశారు. మొదట టీఆర్‌ఎస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారింది. దానికి బీఆర్‌ఎస్‌ అని పేరు పెట్టే బదులు 'ఎఫ్‌ఆర్‌ఎస్'- ఫ్యామిలీ రాష్ట్ర సమితి అని పేరు పెట్టి ఉండాల్సిందని నేను భావిస్తున్నాను. ఇది మరింత సముచితంగా ఉండేది'' అని ఫడ్నవిస్ అన్నారు.

సంక్షేమ పథకాల అమలులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఫడ్నవీస్ ఆరోపించారు. తెలంగాణను బీఆర్‌ఎస్ లూటీ చేసిందని, ఇక్కడ కుటుంబ పాలన మాత్రమే సాగుతోందన్నారు. అధికార బీఆర్‌ఎస్‌ దాని పథకాలతో ఎంత అవినీతి జరిగిందంటే.. ఎక్కడైనా అవినీతి ఒలంపిక్స్ నిర్వహిస్తే అది అన్ని పతకాలు గెలుచుకుంటుందని ఆరోపించారు. తెలంగాణకు మంజీరా నీటి విడుదల విషయంలో కేసీఆర్‌తో తాను మాట్లాడిన మాటలను కూడా ఫడ్నవీస్ గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ వనరులను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

''మన పొరుగు తెలంగాణకు నీరు విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆ నీటిని వ్యవసాయానికి కాకుండా అవినీతికి వినియోగిస్తారని నాకు అప్పుడు తెలియదు'' అని కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు జి కిషన్ రెడ్డితో కలిసి దోమలగూడలో జరిగిన సభలో ఆయన అన్నారు. బీజేపీ ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పూస రాజు తరపున ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ ప్రచారాల గురించి ఫడ్నవీస్ మాట్లాడుతూ.. “కేసీఆర్ సాబ్ (కేసీఆర్ సార్), తెలంగాణలోనే బీజేపీ మిమ్మల్ని ప్యాక్ చేయబోతోంది కాబట్టి మహారాష్ట్రకు వస్తానని కలలు కనడం ఆపండి” అని అన్నారు.

Next Story