బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ

పెంచిన గ్యాస్ ధ‌ర‌ల‌కు నిర‌స‌న‌గా బీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్రమాల‌ను చేప‌ట్టారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2023 7:08 AM GMT
BRS Protested Increased Gas Prices, BRS Protested

పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ మహాధర్నా

వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించే గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ. 350, గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ‌ర్ పై రూ. 50 ను బుధ‌వారం పెంచిన సంగ‌తి తెలిసిందే. మోదీ ప్ర‌భుత్వం వంట గ్యాస్ ధ‌ర‌లు పెంచి సామాన్యుడి న‌డ్డి విరుస్తోంద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా గురువారం, శుక్ర‌వారం భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) పార్టీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆ పార్టీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్‌ పార్టీ నాయ‌కులు, శ్రేణులు మహాధర్నా చేపట్టారు. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన ధ‌ర్నాలో పెద్ద సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్లు, కట్టెల మోపులతో బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు వినూత్నంగా నిరసన తెలియజేశారు.

ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నారు : దానం నాగేంద‌ర్‌

గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర 2014లో రూ.400 ఉండ‌గా దాన్ని రూ.1200 పెంచి ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నార‌ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. మహిళ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు పెంచిన గ్యాస్ ధరలను గిఫ్ట్ గా ఇచ్చిందంటూ సెటైర్ వేశారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

కుత్బుల్లాపూర్‌లోనూ..

కుత్బుల్లాపూర్ లో మహిళలు నిరసన చేపట్టారు. సిలిండర్లపై పూలు చల్లి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్ర‌మే కేంద్ర ప్ర‌భుత్వానికి సామాన్యుడు గుర్తుకు వ‌స్తాడ‌ని ఎన్నిక‌లు ముగియ‌గానే సంప‌న్నులు గుర్తుకు వ‌స్తార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. పెరుగుతున్న వంట గ్యాస్ ధ‌ర‌ల‌ను చూస్తుంటే.. తిరిగి కట్టెల పొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయన్నారు.

బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ

బీజేపీ(భార‌తీయ జ‌న‌తా పార్టీ) అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నిండా ముంచిన బీజేపీని ముంచాలని ప్రభులు చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర పెంచడాన్ని నిరసిస్తూ ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. గతంలో గ్యాస్‌ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని మరి ఇప్పుడు రూ.1100 దాటిందని, ఆ పార్టీ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్ర‌శ్నిచారు. ఎన్నికల తర్వాత గ్యాస్‌ ధరలు పెంచడం ఆనవాయితీగా మారిందన్నారు. ఎన్నికలు రాగానే గ్యాస్‌పై 10 పైసలు తగ్గిస్తారని, అవి పూర్తవగానే రూ.100 పెంచుతారని మండిప‌డ్డారు.

Next Story