సోషల్ మీడియా ఖాతాలు తెరిచిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేశారు.
By Srikanth Gundamalla Published on 27 April 2024 2:29 PM ISTసోషల్ మీడియా ఖాతాలు తెరిచిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేశారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)తో పాటుగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను తెరిచారు. అయితే.. ఇంతకాలం పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. 2023 ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాంతో.. ఆయన సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరువగా ఉండేందుకు.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తెరిచారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషంగా మారింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తరఫున కేసీఆర్ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. బస్సు యాత్ర చేపట్టి ప్రజల్లో మమేకం అవుతూ.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలంటూ విన్నవిస్తున్నారు. ఇక నుంచి నేరుగా ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేయడంతో పాటు.. సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన ప్రచారంలో జోరు పెంచనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను కూడా ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కేసీఆర్ షేర్ చేసుకోనున్నారు. మరోవైపు మొదటగా కేసీఆర్ ఏ పోస్టు పెడతారా అని రాష్ట్ర ప్రజలు, నెటిజన్లలో ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో.. ఆయన తొలి పోస్టు పార్టీ ఆవిర్భావం గురించే పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తన పాత ఫొటోను షేర్ చేశారు కేసీఆర్.
సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసిన తర్వాత.. కేసీఆర్ ఒక ట్రెండ్ సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎక్స్‌లో కేసీఆర్‌ను ఫాలో కావాలనుకునే వారు ఈ లింక్‌ను క్లిక్ చేయండి https://twitter.com/kcrbrspresident