పెట్టుబడులు అమరావతికి తరలిపోయేలా రేవంత్‌రెడ్డి కుట్ర: కౌశిక్‌రెడ్డి

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  13 Sept 2024 4:09 PM IST
పెట్టుబడులు అమరావతికి తరలిపోయేలా రేవంత్‌రెడ్డి కుట్ర: కౌశిక్‌రెడ్డి

తెలంగాణలో హైడ్రా పేరుతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా ద్వారా పెట్టుబడులు అన్నీ అమరావతికి తరలిపోయేలా సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. హైడ్రా వెనుక ఉన్నది ఏపీ సీఎం చంద్రబాబే అంటూ ఆరోపణలు చేశారు. ఆయన ట్రాప్‌లో ఇక్కడి సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని అందుకే అమరావతికి పెట్టుబడులు తరలించే ప్రయత్నం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏ పెట్టుబడి పెట్టాలన్నా హైడ్రాతో భయపడే పరిస్థితులు తీసుకొచ్చారని కౌశిక్‌ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకునేందుకే సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తమ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నేతలను హౌస్ అరెస్టు చేశారని కౌశిక్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్దామని తనతోపాటు శంభిపూర్ రాజు బయలుదేరారని చెప్పారు. తమను కూడా హౌస్ అరెస్ట్ చేశారన్నారు. తన ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రే.. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయాలని ఆదేశాలిచ్చారంటూ ఆరోపణలు చేశారు. హత్యాయత్నం చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిదన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి.

తన విల్లాపై దాడి చేసి సెక్యూరిటీ గేట్లు పగులగొట్టారని కౌశిక్‌ రెడ్డి చెప్పారు. అరికెపూడి గాంధీ రౌడీయిజం చూడటానికి ఓట్లు వేశారా? ఆయన నా ఇంటికి వచ్చి చేసింది ఏం లేదు కానీ.. గాలికి పగిలిపోయే నా గేట్లు పగలగొట్టి వెళ్లిపోయారని అన్నారు. కేసీఆర్ తమ నాయకుడు అనీ.. ఆయన సంస్కారం నేర్పించారని చెప్పారు పాడి కౌశిక్‌ రెడ్డి.

Next Story