తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆ లేఖలో కోరారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానికసంస్థల్లో 42శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కోసం మీ సహకారం కావాలని కోరారు.
సమాజ నిర్మాణంలో నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సుధీర్ఘకాలం నుండి ఉద్యమిస్తున్నారని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ న్యాయమైందని జాగృతి బలంగా విశ్వసిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టామన్నారు. ఉద్యమాలకు దిగివచ్చిన తెలంగాణ పభుత్వం బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిందని చెప్పారు. చాలా కాలం అవుతున్నా ఇంకా రాష్ట్రపతి ఆమోదం రాలేదని, వెంటనే ఆమోదం తెలిపేలా కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు.