డీకే శివకుమార్‌ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి..కాంగ్రెస్‌లో చేరతారా?
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 March 2024 5:15 PM ISTడీకే శివకుమార్‌ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి..కాంగ్రెస్‌లో చేరతారా?
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల నుంచి కొందరు నాయకులు పార్టీని వీడుతున్నారు. అయితే.. కొంతకాలంగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీని వీడుతున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ జరిగింది. ఇక దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆరా తీశారు. అప్పుడు మల్లారెడ్డి కేటీఆర్‌తో తాను పార్టీని వీడటం లేదని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. తాజాగా మల్లారెడ్డి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో డీకే శివకుమార్‌తో సమావేశం అయ్యారు. శుక్రవారం ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజ్‌కి చెందిన భవనాలను అధికారులు కూల్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. తప్పుడు ప్రచారం అంటూ మల్లారెడ్డి కొట్టిపారేశారు. ఇంతలోనే ఇలా పరిణామాలు మారిపోవడంతో రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక డీకే శివకుమార్‌తో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదన్నారు. ఈ అయిదేళ్లు మాత్రమే ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. తాను కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. ఉన్నన్నాళ్లు బీఆర్ఎస్‌లోనే ఉంటానని చెప్పారు. డీకే శివకుమార్‌ను కలవడంపై ప్రశ్నించగా.. ఓ ప్రయివేటు కార్యక్రమంలో డీకే శివకుమార్‌ను కలిశానన్నారు. ఆయన్ని కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. డీకే శివకుమార్ తనకు స్నేహితుడని అన్నారు.