త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తా.. తప్పేముంది?: మల్లారెడ్డి

మరోసారి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుస్తానంటూ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  1 Feb 2024 10:12 AM GMT
brs, mla malla reddy, comments, meet, cm revanth reddy,

త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తా.. తప్పేముంది?: మల్లారెడ్డి

మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన కామెంట్స్‌ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. గతంలో మంత్రి ఉన్న సమయంలో నిత్యం సోషల్‌మీడియాలో ఆయన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌లో ఉండేవారు. అయితే.. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయినా.. ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. మరోసారి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుస్తానంటూ చెప్పారు.

అయితే.. మేడ్చల్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు మల్లారెడ్డి. త్వరలోనే కలిసి పలు విజ్ఞప్తులు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఏం తప్పుందని అన్నారు. అయితే.. తాను సీఎం రేవంత్‌ను కలిశాక ఎలాంటి చర్చకు తావు లేకుండా ఉండేందుకే ముందు మీడియాకు సమాచారం ఇస్తున్నట్లు చెప్పారు. కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అధికారాన్ని కోల్పోతుందని.. కాంగ్రెస్‌ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. తాము ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలపై స్పందించిన మల్లారెడ్డి.. మల్కాజిగిరి ఎంపీగా తననే పోటీ చేయమన్నారనీ.. కానీ తాను టికెట్‌ను తన కుమారుడు భద్రారెడ్డికి అడుగుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇక నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదంటూ మాజీమంత్రి మల్లారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు 71 ఏళ్లు వచ్చాయనీ.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని అన్నారు. ఇక రాజకీయపరంగా ఇవే తనకు చివరి ఐదేళ్లని అన్నారు. ఈ ఐదేళ్లలో నియోజకవర్గ ప్రజలకు బాగా సేవలందిస్తానని మల్లారెడ్డి అన్నారు.

Next Story