లాస్య నందిత మృతిపట్ల రేవంత్‌రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ సంతాపం

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

By Srikanth Gundamalla  Published on  23 Feb 2024 10:11 AM IST
brs, mla lasya nanditha, death, revanth, kcr,

లాస్య నందిత మృతిపట్ల రేవంత్‌రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ సంతాపం

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఓఆర్ఆర్‌పై కారు అదుపుతప్పి రేయిలింగ్‌ను ఢీకొట్టింది. దాంతో.. తీవ్రగాయాలపాలైన ఎమ్మెల్యే లాస్య నందిత స్పాట్‌లోనే చనిపోయారు. డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. లాస్య నందిత అకాల మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఆమె మృతిపట్ల సీఎం రేవంత్‌, మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ తోపాటు రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టిన ఆయన.. లాస్య నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. గతేడాది ఇదే నెలలో సాయన్న స్వర్గస్తులవ్వడం, ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా చనిపోవడం అత్యంత విషాదకరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు రేవంత్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

లాస్య నందిత మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రోడ్డుప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. అతిచిన్న వయసులోనే ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు కేసీఆర్. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. లాస్య నందిత కుటుంబానికి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణంతో బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆమెను ఇటీవల కలిసి పరామర్శించిన ఫొటోలను ఎక్స్‌ వేదికగా షేర్ చేశారు. ఇటీవలే తనని పరామర్శించానీ.. అప్పుడే లాస్య ఇక లేరనే అత్యంత విషాదకరమైన వార్త తెలుసుకున్నానని చెప్పారు. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి ప్రమాదానికి గురికావడం.. ఇందులో ఆమె చనిపోవడం బాధాకరమన్నారు కేటీఆర్. చాలా మంచి నాయకురాలిగా ఉన్న యువ శాసనసభ్యురాలిని కోల్పోవడం బీఆర్ఎస్‌కు తీరని లోటు అని కేటీఆర్ పేర్కొన్నారు.

లాస్య నందిత మృతిపట్ల మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావుతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు ఇతర నేతలంతా సంతాపం తెలుపుతున్నారు. లాస్య నందిత మరణించిన వార్త తెలుసుకున్న హరీశ్‌రావు వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. చిన్న వయసులో లాస్య నందిత అకాల మరణం చెందడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యువ ఎమ్మెల్యే లాస్య నందిత మరణ వార్త కలచివేసిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పారు.

Next Story