NHM కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరం: హరీశ్‌రావు

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.

By Srikanth Gundamalla  Published on  30 May 2024 5:43 AM GMT
brs, mla harish rao,   Telangana, congress govt,

NHM కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరం: హరీశ్‌రావు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహారంపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీరియస్ అయ్యారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని ఆయన మండిపడ్డారు.

నేషనల్‌ హెల్త్‌ మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ తదితర 78 విభాగాల్లో పనిచేస్తున్న 17,541 మందికి జీతాలు అందడం లేదని చెప్పారు. దాంతో.. వారి కుటుంబాలను నడపలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

జీతాలు అందని వారిలో వైద్యులు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, నర్సులు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితరులు ఉన్నాయని హరీశ్‌రావు వెల్లడించారు. వైద్య సిబ్బందికి నెలలుగా జీతాలు రాకపోవడం అంటే.. ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోందని హరీశ్‌రావు విమర్శించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అంటూ గొప్పలు చెబుతున్నారు కానీ.. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ సిబ్బందిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటినా స్పందించి ఆయా ఉద్యోగులకు వెంటనే బకాయి ఉన్న జీతాలు, పీఆర్సీ చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Next Story