సీఎం రేవంత్‌పై పోలీసులకు ఫిర్యాదు

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత ఆర్.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

By అంజి  Published on  28 Jan 2025 12:57 PM IST
BRS, RS ​​Praveen Kumar, police complaint, CM Revanth

సీఎం రేవంత్‌పై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేత ఆర్.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో నాలుగు సార్లు జరగాల్సిన ఫార్ములా-ఈ రేసు ఆయన వల్లే ఆగిపోయిందని, దీంతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి పోయాయని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు ఆగిపోవడంలో రేవంత్‌ పాత్రనే ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వానికి పన్నులు కడుతున్న సిటిజన్‌గా ఆయనపై ఫిర్యాదు చేశానని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఆయనను ప్రశ్నించాలని కోరారు.

రాజ్యంగబద్ధంగా రాష్ట్రాన్ని పాలిస్తానని ప్రమాణం చేసిన సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ అన్నారు. రాష్ట్ర ఆదాయం, ఉద్యోగ అవకాశాల పెంపునకు గత ప్రభుత్వం మొబిలిటీ వ్యాలీ కార్యక్రమం పెట్టడానికి సంకల్పించిందని గుర్తు చేశారు. ఫార్ములా ఈ రేసు నాలుగు సార్లు జరగాల్సి ఉందని, రేవంత్‌ వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయాయని ఆరోపించారు. దీంతో వేలాది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు.

ఫార్ములా -ఈ కార్‌ రేస్‌లో విదేశీ సంస్థకు నిధులు మళ్లించి రాష్ట్ర ఖజానాకు నష్టం చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ పై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఎంఏయూడీ మాజీ స్పెషల్ సీఎస్‌ అర్వింద్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డిపైనా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతున్నది.

Next Story