'నేను నార్కో టెస్ట్‌కు సిద్ధం'.. సీతక్కకు బీఆర్‌ఎస్ నేత పోచంపల్లి సవాల్
కాంగ్రెస్ నాయకురాలు సీతక్క వ్యాఖ్యలతో ములుగు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. సీతక్క వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 14 Nov 2023 5:53 AM GMT'నేను నార్కో టెస్ట్‌కు సిద్ధం'.. సీతక్కకు బీఆర్‌ఎస్ నేత పోచంపల్లి సవాల్
కాంగ్రెస్ నాయకురాలు సీతక్క వ్యాఖ్యలతో ములుగు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఓటర్లకు కల్తీ సారా, దొంగనోట్లను పంచుతున్నారని సీతక్క వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) తనపై, బీఆర్‌ఎస్‌పై చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ, నకిలీ కరెన్సీ పంపిణీపై ఆమె చేసిన ఆరోపణలపై సుమోటోగా సమగ్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు నిరాధారమైతే ఆమెపై కేసు నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)ని బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. కల్తీ మద్యం ఆరోపణలపై విచారణ చేయాలని, ఆ ఆరోపణలు అవాస్తవమైతే ఆమెపై కేసు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు.
మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ములుగు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పార్టీ ఇంచార్జి ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఓటర్లకు నకిలీ నోట్లను పంపిణీ చేయడంతోపాటు కల్తీ మద్యం సరఫరా చేస్తుందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ‘‘ఎన్నికల్లో ఓటమిని పసిగట్టిన సీతక్క బీఆర్‌ఎస్ పార్టీపైనా, నాపైనా బురదజల్లుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ నియమించిన ఇతర ఇంచార్జ్‌ల మాదిరిగా నేనూ ఉన్నాను. ఈ తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆమె బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని కించపరిచే ప్రయత్నం చేస్తోంది’’ అని బీఆర్‌ఎస్ నేతలపై ఇలాంటి ఆరోపణలకు పాల్పడవద్దని ఆయన కోరారు. సీతక్క ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వివిధ వర్గాల నుంచి రూ.80 కోట్లు అందుకున్నారని ఆయన చెప్పారు.
బీఆర్‌ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్న సాకుతో రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ, డీకే శివకుమార్ తదితరుల నుంచి డబ్బులు పొందారని తెలిపారు. “ఆరోపణల నుండి తప్పించుకోవడానికి, ఆమె బీఆర్‌ఎస్ నాయకులపై ఆరోపణలు చేస్తోంది. ఇది ఆమెకు సరికాదు. ఆమె తనను తాను ఈ స్థాయికి దిగజార్చుకోకూడదు, ” అని అన్నారు. తాను బీఆర్‌ఎస్ నేతలకు బినామీగా ఉన్నానని సీతక్క ఆరోపణలు చేశారు. “నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నార్కో పరీక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బు పంపిణీ విషయంలోనూ ఆమె అదే పరీక్షకు సిద్ధమా’’ అని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.