కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరు వస్తువులు దగ్గరే ఉంచుకోండి: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరెంటు కోతలు ఎక్కువయ్యాయని కేటీఆర్ చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  9 May 2024 6:19 AM GMT
brs, ktr, tweet,   six things, congress govt,

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు కాదు.. ఆరు వస్తువులు దగ్గరే ఉంచుకోండి: కేటీఆర్  

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ప్రచారం సమయం కూడా ముగింపు దశకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అగ్రనాయకులు రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై మండిపడుతున్నారు. సోషల్‌ మీడియాను కూడా ఇందుకు వేదికగా చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరెంటు కోతలు ఎక్కువయ్యాయని కేటీఆర్ చెప్పారు. ఎండలు ఒకవైపు మండిపోతున్న క్రమంలో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మహానగరంలో కూడా విద్యుత్ కోతలు విధిస్తున్నారని విమర్శించారు. డిమాండ్‌కు సరిపోయినంత విద్యుత్‌ సరఫరా ఉందని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఎందుకు కోతలు విధిస్తున్నారనేది అర్థం కావడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తాజాగా మరోసారి ఎక్స్‌ వేదిగా కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై సెటైర్లు వేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పినట్లు ఆరు గ్యారెంటీలు ఏమో కానీ.. ప్రజలు మాత్రం కచ్చితంగా ఆరు వస్తువులను దగ్గరే ఉంచుకోవాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆరు వస్తువులను ప్రతి ఒక్కరు సమకూర్చుకోవాలని చెప్పారు. ఆ వస్తువులు ఏవేవో అని కూడా ఆయన పోస్టులో పేర్కొన్నారు. ఇన్వర్టర్, చార్జింగ్ బల్బులు, టార్చ్‌ లైట్లు, జనరేటర్లు, క్యాండిల్స్, పవర్‌ బ్యాంకర్స్‌ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. కరెంటు కోతలు విధిస్తారని అందుకే ప్రజలు వీటిని దగ్గర ఉంచుకోవాలని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఇంతలా కోతలు ఉండేవి కావన్నారు. ఇక మే 13వ తేదీన రాష్ట్ర ప్రజలంతా తెలివిగా ఓటు వేయాలని.. ఓట్‌ ఫర్ కార్. కేసీఆర్ ఫర్ తెలంగాణ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను కేటీఆర్ తన పోస్టుకు జత చేశారు.


Next Story