'నీట్‌'లో 67 మందికి 720 మార్కులు అనుమానాలకు తావిస్తోంది: కేటీఆర్

నీట్‌ పరీక్ష నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  8 Jun 2024 3:15 PM IST
brs, ktr, tweet,  neet exam results ,

'నీట్‌'లో 67 మందికి 720 మార్కులు అనుమానాలకు తావిస్తోంది: కేటీఆర్ 

నీట్‌ పరీక్ష నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మందికి ఏకంగా 720 మార్కులు రావడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. నీట్‌ ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై హైలెవల్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన కేటీఆర్.. ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన విషయం అని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలన్నారు. నీట్‌ ఎగ్జామ్‌కు సంబంధించిన పలు విషయాలను చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగాయని అర్థం అవుతోందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్‌లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనికి తోడు పలువురు విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారని చెప్పారు. నీట్‌లో +4.. -1 మార్కుల విధానం ఉంటుందనీ.. ఈ లెక్కన 718, 719 మార్కులు రావడం సాధ్యం కాదన్నారు. దీనిపై ప్రశ్నిస్తే గ్రేస్‌ మార్కులు ఇచ్చామని చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు కేటీఆర్.

అందుకే అనుమానాలను నివృత్తి చేయాలని.. మార్కులు ఏవిధంగా అంత వచ్చాయో చెప్పాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ఏ విద్యార్థికి నీట్‌లో టాప్‌-5 ర్యాంక్‌లో లేరనీ.. దీనికి కచ్చితంగా నీట్‌లో జరుగుతున్న అక్రమాలే కారణమని నమ్ముతున్నామని అన్నారు. అలాగే గ్రేస్‌ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి మేలు చేసేలా గ్రేస్ మార్కుల విధానం ఉండాలన్నారు. అయితే.. నీట్‌ ఎగ్జామ్‌లో అవకతవకలపై హైలెవల్ ఎక్స్‌పర్ట్‌ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Next Story