ఇది తిరోగమనమే..'ఫార్ములా-ఈ' రేస్‌ రద్దుపై కేటీఆర్ కామెంట్స్

హైదరాబాద్‌లో జరగాల్సిన 'ఫార్ములా-ఈ'రేస్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  6 Jan 2024 7:24 AM GMT
brs, ktr, tweet on formula-e, racing, cancel,

ఇది తిరోగమనమే..'ఫార్ములా-ఈ' రేస్‌ రద్దుపై కేటీఆర్ కామెంట్స్ 

హైదరాబాద్‌లో జరగాల్సిన 'ఫార్ములా-ఈ'రేస్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ రేస్‌ సీజన్‌-10 నాలుగో రౌండ్‌ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా నిర్వాహకులు దానిని రద్దు చేస్తున్నట్లు శనివారం ఉదయమే ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే.. ఈ ఫార్ములా రేస్‌ను రద్దు చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సీరియస్‌ కామెంట్స్ చేశారు.

'ఫార్ములా-ఈ' రేసింగ్‌ను రద్దు చేసిన వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఒక పోస్టు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది నిజంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం అన్నారు కేటీఆర్. హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం, భారత్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేతాయని చెప్పారు. చాలా మంది ఈ రేసింగ్ చూడటానికి ఆసక్తి చూపారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేసింగ్‌ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని కేటీఆర్ అన్నారు. కానీ.. కాంగ్రెస్‌ దానిని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. భారత్‌కు తొలిసారి 'ఫార్ములా-ఈ' ప్రిక్స్‌ను తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఫార్ములా రేసింగ్‌పై అంతకుముందు స్పందించిన నిర్వాహకులు.. తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ శాఖ హోస్ట్‌ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 30న చేసుకున్న ఒప్పందాన్ని తాజాగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. అయితే.. హోస్ట్‌ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. ఈ రేసింగ్‌ను హైదరాబాద్‌కు బదులు హాంకుక్‌ మెక్సికో సిటీలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు.


Next Story