జనవరి 27 నుంచి అసెంబ్లీల వారీగా సమావేశాలు: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది.
By Srikanth Gundamalla
జనవరి 27 నుంచి అసెంబ్లీల వారీగా సమావేశాలు: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ.. నేతలు, కార్యకర్తలకు పలు సూచలను చేస్తున్నారు నేతలు. అయితే.. జనవరి 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ విస్తృత స్థౄయి సమావేశాలు నిర్వహించనుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోఈ సమావేశాలు జరుగుతాయని అన్నారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ సమావేశాలు పూర్తవుతాయని కేటీఆర్ వెల్లడించారు.
ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తిస్థాయి సమీక్షతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సంబందించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశాల బాధ్యతను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు తీసుకుంటారని అన్నారు. 27న సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. 28న సిరిసిల్ల, వర్ధన్నపేట, మెదక్, ముషీరాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో, 29న ఆలేరు, నర్సంపేట, ఖైరతాబాద్, జుక్కల్, ఆందోల్, వికారాబాద్, జగిత్యాల నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతాయని కేటీఆర్ అన్నారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై స్పందించిన కేటీఆర్ పలు విమర్శలు చేశారు. ఆరు గ్యారెంటీల్లో ఉన్న 13 హామీల అమలుపై వెంటనే జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా చేతులెత్తేస్తే ప్రజలు నిలదీస్తారని అన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ చెప్పారు. ఫార్మాసిటి రద్దు, ఎయిర్‌పోర్టు మెట్రో రద్దుపై ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక ఆటో డ్రైవర్ల సమస్యలపైనా పార్టీ తరఫున మాట్లాడతామన్నారు. స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వర్గాల ప్రజలను దూరం చేసుకుందని కేటీఆర్ అన్నారు.