ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇంచార్జ్‌లు: కేటీఆర్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  25 Dec 2023 3:19 PM IST
brs, ktr, meeting,  chevella,

ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇంచార్జ్‌లు: కేటీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మేజిక్‌ ఫిగర్‌ను దాటిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అయితే.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి. అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్‌ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలిచి తమ సత్తా చూపించేందుకు సన్నద్ధం అవుతోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు.

లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జనవరి 26వ తేదీ లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైందని కుంగిపోవద్దని చెప్పారు. పరాజయం చెందిన బీఆర్ఎస్‌ అభ్యర్థులే నియోజకవర్గ ఇంచార్జ్‌లు అని.. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ సత్తా చూపిద్దామని.. ఏమాత్రం కుంగిపోకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేసిన పనుల గురించి వివరించాలని చెప్పారు కేటీఆర్.

ఇక చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్‌ నేతలతో కేటీఆర్ సమావేశం అనంతరం.. ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా మాట్లాడారు. తనని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కేటీఆర్ చెప్పారని అన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసినట్లు వివరించారు. బీఆర్ఎస్‌ ఖాళీ అవుతుందని కాంగ్రెస్‌, బీజేపీలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొడతామని రంజిత్‌రెడ్డి అన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఈ సందర్భంగా చెప్పారు ఎంపీ రంజిత్‌రెడ్డి.

Next Story