బీఆర్ఎస్ నేతలు ఇక అలా మాట్లాడొద్దు: కేటీఆర్

పార్టీ నేతలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  12 Jan 2024 4:37 PM IST
brs, ktr, telangana bhavan,

బీఆర్ఎస్ నేతలు ఇక అలా మాట్లాడొద్దు: కేటీఆర్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌ తర్వాతి జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మాజీమంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం, భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్యనేతలంతా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తప్పు చేశారని మాట్లాడటం మానుకోవాలన్నారు. ఇక నుంచి బీఆర్ఎస్‌ నేతలు ప్రజలు తప్పు చేశారు.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం ప్రజల తప్పే అంటూ వ్యాఖ్యానించొద్దని సూచిచంఆరు. అయితే.. బీఆర్ఎస్‌ను ఎన్నికల్లో ఓడించి ప్రజలు తప్పు చేశారని పార్టీ నేతలు వివిధ సందర్భాల్లో అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక నుంచి ప్రజలను ఉద్దేశించి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కేటీఆర్ సూచించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీని రెండు పర్యాయాలు గెలిపించింది అదే ప్రజలు.. ఇది గుర్తుంచుకోవాలని పార్టీ నేతలకు కేటీఆర్ చెప్పారు. ప్రజలు మన పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి, బీఆర్ఎస్‌కు ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమే అన్నారు. పద్నాలుగు చోట్ల అతి స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు మాజీమంత్రి కేటీఆర్. ఇక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నాయకులంతా కలిసి పనిచేయాలని.. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిద్దుకుని మరోసారి గులాబీ జెండాను ఎగురవేద్దామని పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Next Story