లాస్య నందిత కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ

లాస్య నందిత కుటుంబ సభ్యులను వారి నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

By Srikanth Gundamalla  Published on  25 Feb 2024 11:28 AM IST
brs, KTR, condolence,  Lasya Nandita family,

లాస్య నందిత కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా లాస్య నందిత కుటుంబ సభ్యులను వారి నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆదివారం కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు వెళ్లారు. కార్ఖానాలోని నందిత నివాసంలో చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. లాస్య నందిత తల్లితో పాటు సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించి.. కాసేపు మాట్లాడారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోయిందన్న వార్త విని షాక్‌కు గురయ్యానని అన్నారు. విదేశాల్లో ఉండటం వల్లే తాను లాస్య నందిత అంత్యక్రియలకు హాజరుకాలేకపోయానని చెప్పారు. లాస్య నందిత గత కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలను ఎదుర్కొన్నారని చెప్పారు. ఏడాది క్రితమే లాస్య నందిత తండ్రి సాయన్న చనిపోయారని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు లాస్య నందిత చనిపోవడం చాలా బాధాకరమని అన్నారు. లాస్య నందిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కేటీఆర్ అన్నారు. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.

లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో చనిపోయారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వద్ద ఈ సంఘటన జరిగింది. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు గుర్తు తెలియని భారీ వాహనాన్ని ముందుగా ఢీకొట్టిందనీ.. ఆ తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను ఢీకొట్టినట్లు అధికారులు చెబుతున్నారు. తలకు తీవ్రగాయాలు కావడంతో లాస్య స్పాట్‌లోనే చనిపోయిందని అధికారులు అంటున్నారు.

Next Story