అండగా ఉంటాం..హైడ్రా బాధితులు పార్టీ ఆఫీస్‌కు రండి: కేటీఆర్

గత కొద్దిరోజులుగా తెలంగాణలో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  26 Sep 2024 10:19 AM GMT
అండగా ఉంటాం..హైడ్రా బాధితులు పార్టీ ఆఫీస్‌కు రండి: కేటీఆర్

గత కొద్దిరోజులుగా తెలంగాణలో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎవరికైనా సమస్య వస్తే హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు రావాలని పిలుపునిచ్చారు. హైడ్రా బాధితులందరికీ తమ పార్టీ, పార్టీ న్యాయ విభాగం అండగా నిలుస్తుందని కేటీఆర్ వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10, రోడ్డు నెంబర్ 12 మధ్యలో ఉంటుందని, అక్కడకు ఇబ్బందిపడిన వారు రావొచ్చునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. అక్కడ తమ న్యాయవిభాగం సహకారం అందిస్తుందన్నారు. తమకు ఓటు వేసి గెలిపించినందుకు హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో దాదాపు అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లే ఉన్నారని.. బాధితులు వాఇ వద్దకు కూడా వెళ్లవచ్చుని చెప్పారు. న్యాయ పరమైన సాయం అందిస్తామని అన్నారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించాలని న్యాయస్థానం ద్వారానే ప్రభుత్వానికి చెప్పిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పాలిట శాపంగా మారిందని అన్నారు కేటీఆర్. వారి ఇళ్లను నిర్దాక్షిన్యంగా కూల్చేస్తున్నారని ఆరోపించారు. సామాన్యుల పట్ల అమానవీయంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని అన్నారు. రోడ్డుపక్కన చిన్నచిన్న దుకాణాలు నడుపుకొనే వారి బతుకులను ఆగం చేయొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ శాఖ ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. కొంతమంది నివాసాలు రిజిస్ట్రేషన్ అయిన మూడు రోజులకే కూల్చివేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అందుకే హైడ్రా బాధితులకు తాము అండగా ఉంటామనీ.. న్యాయపరంగా అవసరమైన సాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

Next Story