కేసీఆర్‌కు పేరొస్తుందనే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడంలేదు: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  14 Sept 2024 6:25 PM IST
కేసీఆర్‌కు పేరొస్తుందనే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడంలేదు: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా నేరెళ్లపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్ మాట్లాడుతూ.. రైతులను పట్టించుకోవడం లేదన్నారు. అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకు పెట్టిందని ఆరోపించారు. అంతేకాదు..కేవలం 10 శాతం పనులే మిగిలి ఉన్నా.. ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ఒక వేళ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందనే పక్కన పెట్టారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్ నుంచి ఉదండపూర్ వరకు దాదాపు అన్ని జలాశయాల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. కాల్వలు తవ్వి నీరందిస్తే పాలమూరు పచ్చబడుతుందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పిలిచిన కాల్వల టెండర్లను, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ రద్దు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయని చెప్పారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు రైతుల సమస్యను తీర్చాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

గతంలో మేడిగడ్డకు వెళ్లినట్లుగానే.. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా సందర్శిస్తామని కేటీఆర్ చెప్పారు. పూర్తయిన ప్రతీ జలాశయాన్ని ప్రజలకు చూపిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లను ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని కూల్చివేస్తోందని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 523 సర్వే నెంబర్‌లో 75 మంది దివ్యాంగుల ఇళ్లను అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని కేటీఆర్ ఖండించారు. రేవంత్‌రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రి చేసింది.. ఇళ్లను కూల్చడానికేనా అని ప్రశ్నించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే డబుల్‌బెడ్రూం ఇళ్లను కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

Next Story