కృష్ణా నీటిపై హక్కు..చావో రేవో తేల్చే సమస్య: కేసీఆర్
ఛలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 6:33 PM ISTకృష్ణా నీటిపై హక్కు..చావో రేవో తేల్చే సమస్య: కేసీఆర్
ఛలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇది ఉద్యమ సభ, పోరాట సభ అని చెప్పారు. రాజకీయ సభ అని ఎవరూ విమర్శించడానికి వీల్లేదని అన్నారు. కృష్ణా నది నీటిపై మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మనందరి బతుకులకు చావో రేవో తేల్చే సమస్య అని కేసీఆర్ అన్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ చలో నల్లగొండ సభను నిర్వహించిన విషయం తెలిసిందే.
తన కాలు విరిగినా కూడా సభకు వచ్చానని కేసీఆర్ అన్నారు. కృష్ణా నీటిపై మన హక్కు మనందరి బతుకులకు చావో రేవో అని తెలంగాణలో పక్షిలా తిరుగుతూ చెప్పానని అన్నారు. దానికి 24 ఏళ్ల సమయం పట్టిందన్నారు కేసీఆర్. కృష్ణా నది అయినా.. గోదావరి నది అయినా.. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదని కేసీఆర్ అన్నారు. నల్లగొండలో ఒకప్పుడు నీళ్లు లేక ప్రజల బతుకులు వంగిపోయాయని అన్నారు. ఫ్లోరైడ్‌తో ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఉద్యమకారులంతా కలిసి ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయిన బిడ్డలను తీసుకెళ్లి ప్రధాని టేబుల్‌పై పడుకోబెట్టి మా బతుకు ఇది అని చెప్పుకున్నామన్నారు. అయినా కూడా అప్పుడెవరూ పట్టించుకోలేదని కేసీఆర్ చెప్పారు.
అయితే.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం జీరో ఫ్లోరైడ్‌గా చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయనీ.. తాము ఇప్పుడు సంతోషంగా ఉన్నామని చెబుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. ఆనాడు ఫ్లోరైడ్ సమస్య అంటే ఎవరూ రాలేదు.. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అందుకే మన హక్కులను మనమే కాపాడుకోవాలని కేసీఆర పిలుపునిచ్చాడు. ఈ సభను చిల్లరమల్లర రాజకీయ సభగా చూడొద్దనీ.. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి మన నీటిని దొంగిలించుకుపోదామనుకునే వారికి ఈ చలో నల్లగొండ సభ ఒక వార్నింగ్ అంటూ కేసీఆర్ చెప్పారు.
అలాగే కాంగ్రెస్ నేతలపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా అని మండిపడ్డారు. పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయనీ.. అవి మీరు వేసుకునే చెప్పులకంటే గట్టిగా ఉంటాయని అన్నారు. తాను నల్లగొండ పర్యటనకు వస్తున్నా అంటే కొందరు కాంగ్రెస్ నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను నల్లగొండలో తిరగనియ్యం అంటున్నారని చెప్పారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే నల్లగొండలో తిరగనియ్యరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వస్తూనే ఉంటాయని అన్నారు. అలా అని నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు అన్నారు. దమ్ముంటే ముందు ప్రభుత్వం కంటే మరింత ఎక్కువ అభివృద్ధి సాధించి చూపించాలని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.